భూకబ్జాల బాణం రివర్సైంది

భూకబ్జాల బాణం రివర్సైంది

రాష్ట్ర కేబినెట్ నుంచి ఈటల రాజేందర్​ను బయటకు పంపేందుకు వేసిన భూకబ్జాల బాణం రివర్స్​ అయ్యింది. దేవరయాంజాల్​లోని భూకబ్జాకు సంబంధించి మంత్రి కేటీఆర్​ సహా పలువురు మంత్రులు, టీఆర్ఎస్​ నేతలతో పాటు కేసీఆర్​ సమీప బంధువుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దేవుడి మాన్యం భూములకు చెందిన సర్వే నంబర్లలోనే కేసీఆర్‌‌కు చెందిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రింటింగ్​​ ఆఫీసులు ఉన్నాయి. అక్కడి నుంచే వీటి ప్రింటింగ్ జరుగుతోంది. ఈటలకు చెందిన అక్రమ నిర్మాణాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్​ల కమిటీ వేసింది. మరి అదే భూముల్లో ఉన్న కేసీఆర్ బంధువులు, మంత్రుల అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ప్రజలు చూస్తున్నారు.

ఇతర మంత్రులు, పార్టీ లీడర్లపై ఇదే స్పీడ్ లేదేం
ఒకవేళ ఈటలపై భూకబ్జా ఆరోపణలు నిజమే అనుకున్నా.. ఇంతకు ముందు ఎంతో మంది మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులపై ఎన్నో ఆరోపణలు ఆధారాలతో రుజువయ్యాయి. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అనిపించలేదు. పైగా అధికార పార్టీకి చెందిన కబ్జా నాయకులకు ప్రభుత్వం నుంచి మరింత మద్దతు లభించింది. మంత్రి మల్లారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లాంటి వారిపై వచ్చిన ఫిర్యాదులు బుట్ట దాఖలయ్యాయి. సైదిరెడ్డి భూ ఆక్రమణలపై గుర్రంపోడు తండాకు బీజేపీ నేతలు వెళ్లి ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో చలనం రాకపోగా, అక్కడికి వెళ్లిన నాయకులపై కేసులు పెట్టారు. ఉస్మానియా వర్సిటీ భూమిని ఆక్రమించి ముత్తిరెడ్డి కట్టిన ఫైవ్​ స్టార్​ హోటల్ కు వ్యతిరేకంగా ఏబీవీపీ నాయకులు ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు. మైహోం రామేశ్వరరావు భూ ఆక్రమణలపై హైదరాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీ స్టూడెంట్లు కూడా ఉద్యమించిన దాఖలాలు ఉన్నాయి. టీఎన్జీవో నాయకులను వెనక నుంచి నడిపించి హెచ్​సీయూ భూములను ఓ మంత్రి చెప్పుచేతుల్లో పెట్టుకున్నట్టు ఆరోపణలున్నాయి. 

తెలంగాణ రాష్ట్ర సమితిలో వ్యవస్థాపక నాయకుడిగా ఉండి, పార్టీ ఆటు పోట్లలో వెన్నుదన్నుగా నిలిచారు ఈటల రాజేందర్. కానీ ఇప్పుడు ఈటలను ప్లాన్​ ప్రకారం పార్టీ నుంచి పంపించేయడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. 72 గంటల్లోనే భూకబ్జా ఆరోపణలపై కమిటీ వేయడం, ఆ కమిటీ నివేదిక ఇవ్వడం, ఆరోగ్య శాఖ నుంచి ఈటలను తప్పించడం, కేబినెట్​ నుంచి ఆయనను బర్తరఫ్ చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ క్రమంలో ఇప్పటి వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసైన్డ్​ భూముల కబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి పెట్టాల్సిన టీఆర్ఎస్​ ప్రభుత్వం, ఈటల రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడంపై, ఆయనను మెడపట్టి పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి గెంటివేసే పనులపై ధ్యాస పెట్టడం ప్రభుత్వ పెద్దల ప్రాధాన్యతలను సూచిస్తోంది. ఈటలపై వేటు వేసేందుకు భూకబ్జా అంశాన్ని ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. 

అధినేతకు ఎదురుచెపితే ఖతమే
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్​కు ఎదురు చెప్పిన నాయకులు పార్టీలో బతికి బట్ట కట్టిన దాఖలాలు లేవు. ఇది 20 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో తేటతెల్లం అయింది. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన ఎంతోమంది నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు. ఆనాటి బీసీ నాయకుడు ఆలె నరేంద్ర నుంచి మొదలుపెడితే చెరుకు సుధాకర్, విజయశాంతి, కేకే మహేందర్రెడ్డి , జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇన్నయ్య, డి.శ్రీనివాస్, ఇప్పుడు రాజేందర్ ఇలా ఎన్నో పేర్లు ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాదరణ కలిగిన బలమైన బీసీ నాయకుడు ఈటల రాజేందర్. ఉద్యమ నాయకుడైన ఆయనను కేబినెట్​ నుంచి తొలగించడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతోంది. ఆయనపై వచ్చిన ఆరోపణలు కుట్రపూరితమైనవని కూడా భావిస్తోంది. ఇప్పటికీ టీఆర్ఎస్ లో చాలామంది అసమ్మతి వాదులు ఉన్నారు. అధినేతపై, పార్టీ తీరుపై అసంతృప్తి ఉన్నా.. పార్టీ అధికారంలో ఉందన్న కారణంతో కక్ష కట్టి కటకటాల పాలు చేస్తుందనే భావనతో నోరు విప్పడం లేదు. 

కేసీఆర్​ ఫ్యామీలీపైనా కబ్జా ఆరోపణలు
ఇక కేసీఆర్​ కుటుంబంపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు లెక్కే లేదు. దేవరయాంజాల్‌‌లోని 84 ఎకరాల భూమిని కేసీఆర్ దగ్గరి బంధువు గండ్ర శ్రీనివాస్‌‌రావు ఆక్రమించి అమ్ముకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూములు 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నా రిజిస్ట్రేషన్ చేశారు. గతంలోనూ 111 జీవో భూముల్లో కేటీఆర్ అక్రమంగా ఫామ్​హౌస్​ కట్టారని ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలపైనా గంటల వ్యవధిలో విచారణ చేయించి తమ పార్టీ నాయకులను శిక్షించడం, బహిష్కరించడం చేసి ఉంటే ఈటలపై తీసుకున్న చర్యలను ప్రజలు కూడా సమర్థించే వారు. కానీ, ఎంతోమంది కబ్జాదారులను వెనకేసుకొచ్చి, ఆరోపణలను తొక్కిపెట్టి ఈటల విషయంలో మాత్రమే అతిగా స్పందించడం తెలంగాణ సమాజానికి తప్పుడు సంకేతాలిస్తోంది.

విభేదాలు ఇప్పటివి కాదు
వాస్తవానికి ఈటలకు, పార్టీ హైకమాండ్​కు మధ్య విభేదాలు ఇప్పటికిప్పుడు భూకబ్జా ఆరోపణలతో వచ్చినవి కావు. గత కొంత కాలంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఈటలకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఒక దశలో కేటీఆర్ ను సీఎం కాకుండా అడ్డుకున్నాడన్న అపవాదు కూడా ఈటలపై పడింది. కేటీఆర్ అనుకూల వర్గం అందుకు బాధ్యుడిగా ఈటలను బోనులో నిలబెట్టాలని ఒత్తిడి చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. సీఎం మార్పు అంటూ ప్రచారం జరిగిన సమయంలో ‘గులాబీ జెండాకు అసలైన ఓనర్లం’, ‘పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు మాకు పార్టీపై వాటా ఉంది’ అంటూ ఈటల చేసిన కామెంట్లు టీఆర్ఎస్​లో లుకలుకలను బయటపెట్టాయి. ఇలాంటి గొంతు నొక్కేయకపోతే మరిన్ని   అసంతృప్తి స్వరాలు పెరుగుతాయనే భావన కూడా పార్టీ నాయకత్వంలో ఉంది. మరిన్ని గొంతులు లేవకముందే ఈటల లాంటి బలమైన నాయకుడిని గెంటేస్తే ఎంతటి వారైనా ఎదురు మాట్లాడితే శిక్ష తప్పదన్న సంకేతం ఇవ్వాలని భావించి ఈటలపై వేటు వేసినట్టుగా కనిపిస్తోంది. పైగా బలమైన బీసీ నాయకుడిని బయటకు వెళ్లగొట్టి ఈటల అంశాన్ని బీసీ కోణంలో చూడొద్దంటూ బీసీ మంత్రులతో ప్రకటనలు ఇప్పించే ప్రయత్నం జరుగుతోంది. 

ఈటల అడుగులు ఎటువైపు?
ఈటల రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతున్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికీ విశ్వసనీయత ఉన్న నాయకునిగా ఈటలకు గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని బీసీ సంఘాలతో మమేకమై ముందుకెళ్లడం ఆయనకు ఒక ప్రత్యామ్నాయం. సహజంగానే అన్ని ప్రతిపక్షాలు ఆయనను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే. కేంద్ర ప్రభుత్వంతో కలిసి టీఆర్ఎస్ లో ఉన్న అవినీతిని, అక్రమాలను, ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి వీలుకలుగుతుంది. అలాగే అధికార పార్టీలో ఉన్న అసమ్మతి నాయకులను ఏకం చేసే ప్రయత్నం కూడా ఈటల చేయవచ్చు. 
- డాక్టర్ దొంతగాని వీరబాబు, 
అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్